Asian Games 2026: పతక పరుగు మొదలైంది.. - Eenadu
Asian Games 2026: పతక పరుగు మొదలైంది.. Eenadu
First reported 5 days ago · latest update 8 hours ago
4×400 మిక్స్‌డ్ రిలేలో భారత్‌కు రజతం 10 వేల మీ.లో సీమ కుమారికి కాంస్యం
మను టీఎస్, పూవమ్మ రాజు, విశాల్ తెన్నరసు, విద్య రామ్‌రాజ్
ఆసియా క్రీడల్లో గురువారం భారత్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. అథ్లెటిక్స్‌లో తొలి రోజే ఓ రజతం, కాంస్యం దక్కడం భారత శిబిరంలో ఉత్సాహం నింపినా.. వుషులో ఓ రజతం, రోయింగ్‌లో ఓ కాంస్యం లభించినా.. పతకాల పంట పండుతుందనుకున్న షూటింగ్‌లో మాత్రం నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. స్కీట్‌లో ఒక కాంస్యం దక్కినప్పటికీ, షూటింగ్‌లో పసిడి కోసం భారత్ నిరీక్షణకు తెరదించుతారనుకున్న ఎయిర్ పిస్టల్ షూటర్లు.. కనీసం ఓ పతకం కూడా తీసుకురాలేకపోయారు. మిగతా ఆటల్లో భారత క్రీడాకారులు పర్వాలేదనిపించారు.
ఆసియా క్రీడల అథ్లెటిక్స్‌ను భారత క్రీడాకారులు ఆశాజనకంగా ఆరంభించారు. గురువారం పరుగు పోటీల్లో భారత్‌కు ఓ రజతం, కాంస్యం దక్కింది. 4×400 మీటర్ల మిక్స్‌డ్ రిలే పోటీల్లో పూవమ్మ రాజు, విశాల్ తెన్నరసు, విద్య రామ్‌రాజ్, మను టీఎస్‌లతో కూడిన భారత జట్టు చక్కటి ప్రదర్శనతో రజతం సాధించింది. ఈ బృందం 3 నిమిషాల 14.46 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని రెండో స్థానంలో నిలిచింది. బహ్రెయిన్ జట్టు 3:12.87 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణం సాధించింది. కాంస్యం నెగ్గిన వియత్నాం (3:14.54 సె)కు, భారత్‌కు తేడా 0.08 సెకన్లే కావడం విశేషం. చివరగా బ్యాటన్ అందుకున్న విద్య అద్భుత ప్రదర్శనతో భారత్‌కు రజతం దక్కడంలో కీలక పాత్ర పోషించింది. 2018 ఆసియా క్రీడల్లో తొలిసారి ఈ ఈవెంట్‌ను ప్రవేశపెట్టినపుడు స్వర్ణం గెలిచిన భారత్.. గత క్రీడల్లో రజతం సాధించింది. తాము స్వర్ణం మీదే గురి పెట్టామని, కానీ బహ్రెయిన్ గట్టి పోటీ ఇచ్చి ఆ పతకాన్ని చేజిక్కించుకుందని.. మహిళల 4×400 రిలేలో మాత్రం స్వర్ణం గెలిచి తీరుతామని పూవమ్మ ధీమా వ్యక్తం చేసింది. ఇక మహిళల 10 వేల మీటర్ల పరుగులో సీమ కుమారి.. కాంస్యం గెలవడం అనూహ్యమే. ఈ పోటీలో భారత్ పతకం నెగ్గి 16 ఏళ్లవుతోంది. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన సీమ.. 32 నిమిషాల 50.05 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి మూడో స్థానం సాధించింది. విన్‌యావి (32:39.18 సె), టనాక (32:41.54 సె) వరుసగా స్వర్ణం, రజతం గెలిచారు. మొత్తంగా ఈ పరుగులో భారత్‌కిది మూడో ఆసియా క్రీడల పతకం. మహిళల ట్రిపుల్ జంప్‌లో ఆశా ఇలంగో త్రుటిలో కాంస్యం కోల్పోయింది. ఆమె చైనా అథ్లెట్ యి లితో సమానంగా 13.83 మీటర్ల దూరం దూకింది. అయితే రెండో ఉత్తమ జంప్‌లో యి లి 13.79 మీటర్లు దూకగా, ఆశా 13.65 మీటర్ల ప్రదర్శనే చేయడంతో పతకం ఆమె చేజారింది.
రోయింగ్‌లో ఒకటి..
రోయింగ్‌లో సత్నాం సింగ్, సల్మాన్ ఖాన్ జోడీ భారత పరువు నిలిపింది. కనీసం అయిదు పతకాల అంచనాలతో రోయింగ్ బృందం ఆసియా క్రీడల్లో బరిలో దిగగా ఈసారి కేవలం ఒకే పతకం లభించింది. గురువారం సత్నాం-సల్మాన్ జంట పురుషుల డబుల్ స్కల్స్‌లో కాంస్యం నెగ్గింది. ఈ క్రీడల్లో డబుల్ స్కల్స్‌లో పతకం లభించడం భారత్‌కు ఇదే తొలిసారి. ఫైనల్లో ఆఖరి 500 మీటర్ల పోటీలో భారత ద్వయం మూడో స్థానానికి పడిపోయింది. పోటీలో తొలి 1500 మీటర్ల వరకు రెండో స్థానంలో ఉన్న సత్నాం, సల్మాన్ జంట.. ఫైనల్‌ను 6 నిమిషాల 13.25 సెకన్లలో ముగించింది. యి జుని-యిడె నై (చైనా, 6:09.37) స్వర్ణం.. సోరిన్-మెక్రోజ్బెక్ (ఉజ్బెకిస్థాన్; 6:10.49) రజతం గెలుచుకున్నారు. ఆసియా క్రీడల రోయింగ్‌లో భారత పేలవ ప్రదర్శనల్లో ఇదొకటి. 1982లో ఈ క్రీడను ప్రవేశపెట్టినప్పటి నుంచి కేవలం ఒక పతకానికి పరిమితం కావడం ఇది నాలుగోసారి. 1982, 1994, 2002లోనూ ఒకే పతకం లభించింది. 2010, 2023లో అత్యధికంగా అయిదేసి పతకాలు లభించాయి. వివిధ విభాగాల్లో పోటీపడే క్రీడాకారుల ఎంపికపై వివాదం జట్టు ప్రదర్శనను దెబ్బతీసిందని సమాచారం. పోటీల ఆరంభానికి రెండు రోజుల ముందు క్రీడాకారులు ఎంపికపై ఆందోళన వ్యక్తం చేశారు. తమ విభాగాలను మార్చారని.. రిజర్వ్‌లుగా ఉన్న ఆటగాళ్లను ప్రధాన జట్టులో చేర్చారని విమర్శిచారు. తన భాగస్వామిని అయిదు రోజుల ముందు మార్చారని లేదంటే.. ఇంకా మెరుగైన ప్రదర్శన చేసేవాళ్లమని కాంస్య పతక విజేత సత్నాం చెప్పాడు. గత క్రీడల్లో అతడు క్వాడ్రాపుల్ స్కల్స్‌లో కాంస్యం గెలిచాడు. జాతీయ హ్యాండ్‌బాల్ ప్లేయర్‌గా ఉన్న 28 ఏళ్ల సత్నాం.. మాజీ ఒలింపియన్ స్వర్ణ్ సింగ్ విర్క్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఎనిమిదేళ్ల క్రితం రోయింగ్‌లో అడుగుపెట్టాడు.
క్వార్టర్‌ఫైనల్లో అనాహత్, తన్వి: స్క్వాష్‌లో భారత క్రీడాకారులు అదరగొట్టారు. సింగిల్స్‌లో ఫేవరెట్ అనాహత్ సింగ్, తన్వి ఖన్నా, అభయ్ సింగ్, వీర్ చోత్రాని క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో జోష్న చినప్ప, సెంథిల్ కుమార్ జోడీ కూడా తుది ఎనిమిదిలో చోటు సంపాదించింది. జూనియర్ ప్రపంచ ఛాంపియన్ అనాహత్ 3-0 (11-4, 11-5, 11-7)తో వెయ్ లిన్ యు యియాంగ్ (సింగపూర్)ను కేవలం 19 నిమిషాల్లో ఓడించింది. క్వార్టర్‌ఫైనల్లో ఆమె సహచరిణి తన్వితో తలపడనుంది. తన్వి 3-1 (5-11, 11-4, 11-5, 13-11)తో వెయ్ యాన్ యు యియాంగ్ (సింగపూర్)పై గెలిచింది. అనాహత్, తన్విలలో ఒకరు సెమీస్ చేరడం ఖాయం. అయినా భారత్‌కు పతకం ఖాయం కాదు. స్క్వాష్‌లో ఈసారి మూడో స్థానం కోసం పోటీ నిర్వహించనున్నారు. పురుషుల సింగిల్స్‌లో అభయ్ సింగ్ 3-0 (11-5, 11-6, 11-0)తో రవిందు లక్‌సిరి (శ్రీలంక)పై, వీర్ 3-2 (11-9, 8-11, 11-6, 15-17, 11-6)తో సంజయ్ జీవ (మలేసియా)పై గెలిచి క్వార్టర్స్ చేరారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో జోష్న, సెంథిల్ జోడీ 11-7, 11-10తో భారత్‌కే చెందిన సూరజ్ చంద్, షమీనా రియాజ్‌ను ఓడించి ముందంజ వేసింది.
ప్రిక్వార్టర్స్‌లో శ్రీజ జోడీ: టేబుల్ టెన్నిస్‌లో భారత జోడీలు ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించాయి. మహిళల డబుల్స్‌లో శ్రీజ, సిండ్రెలా దాస్ జంట 3-0 (11-5, 11-4, 12-10)తో బురెన్‌జర్గాల్ సంజా, బొలార్ ఎర్డీన్ (మంగోలియా)పై గెలవగా.. యశశ్విని, దియ జంట 3-0 (11-2, 11-2, 11-4)తో సెతాయిష్, మహ్‌షిద్ (ఇరాన్)పై గెలిచాయి. పురుషుల సింగిల్స్‌లో మనుష్ షా, మానవ్ థక్కర్ రెండో రౌండ్లో విజయాలను అందుకున్నారు. ఫెన్సింగ్‌లో పతకం లేకుండానే భారత్ పోటీని ముగించింది. భవాని దేవి, శ్రేయ గుప్తా మహిళల వ్యక్తిగత విభాగం ప్రిక్వార్టర్స్‌లో ఓడిపోయారు.
హాకీలో జోరు: హాకీలో భారత జోరు కొనసాగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ 8-2తో కొరియాను ఓడించింది. దిల్‌ప్రీత్ (10వ, 26వ, 32వ నిమిషం) హ్యాట్రిక్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అభిషేక్ (15వ, 38వ) రెండు గోల్స్ సాధించగా.. షిలానంద్ (4వ), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (11వ), రాజిందర్ (60వ) తలో గోల్ చేశారు.తన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ ఆతిథ్య జపాన్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌లో ఓడినా సెమీస్ చేరడం దాదాపు ఖాయం.
సాక్షి విఫలం: కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతక విజేత సాక్షి చౌదరి ఆసియా క్రీడల్లో పతకం తేవడంలో విఫలమైంది. హోరాహోరీగా సాగిన మహిళల 51 కిలోల ప్రిక్వార్టర్స్‌లో సాక్షి 2-3తో అలువ బల్కిబెకోవా (కజకిస్థాన్) చేతిలో ఓడింది. పురుషుల 70 కిలోల విభాగంలో సుమిత్ గాయం కారణంగా పోటీపడలేదు. మహిళల జిమ్నాస్టిక్స్ వాల్ట్ విభాగంలో ఫైనల్ చేరి ఆశలు రేపిన ప్రణతి నాయక్ ఆరో స్థానానికి పరిమితమైంది.
రోషిబినాకు రజతమే..
మణిపురి మెరుపు నోరెమ్ రోషిబినా బంగారు కల నెరవేరలేదు. ఆసియా క్రీడల్లో ఇప్పటికే కాంస్యం, రజతం గెలుచుకున్న ఆమె.. మూడో ప్రయత్నంలోనూ స్వర్ణం అందుకోలేదు. గురువారం మహిళల 60 కిలోల వుషు ఫైనల్లో రోషిబినా 0-2తో జాంగ్ జియాయు (చైనా) చేతిలో ఓడి రజతానికి పరిమితమైంది. మ్యాచ్‌లో ఏ దశలోనూ ఆమె ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేకపోయింది. దూకుడుగా ఆడిన చైనా ప్లేయర్ సైడ్ కిక్‌లతో రోషిబినాపై ఆధిపత్యం ప్రదర్శించింది. 2018 ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన 25 ఏళ్ల రోషిబినా.. 2023లో రజతం నెగ్గింది. ‘‘ఈసారి కూడా రజతమే గెలిచాను. భారత ప్రజలకు స్వర్ణం అందించలేకపోయాను. గందరగోళ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చాను. సెప్టెంబరు 10న జట్టులో ఎంపికైన విషయం తెలుసుకుని ఇంటి నుంచి నేరుగా ఇక్కడికి వచ్చేశాను. సన్నాహానికి సమయం సరిపోలేదు. నా కోచ్ మద్దతుతో వరుసగా మూడో ఆసియా క్రీడల్లో పతకం గెలవగలిగాను’’ అని మ్యాచ్ అనంతరం రోషిబినా చెప్పింది. సెలక్షన్ ట్రయల్స్‌లో రోషిబినాను ఓడించిన దివ్యాంశి చౌదరి గాయపడటంతో క్రీడల ఆరంభానికి కొద్ది రోజల ముందు.. ఆమె స్థానంలో రోషిబినాను జట్టులోకి చేర్చిన సంగతి తెలిసిందే.
కబడ్డీలో సెమీస్‌కు..
కబడ్డీలో భారత పురుషుల, మహిళల జట్లు సెమీఫైనల్‌కు దూసుకెళ్లాయి. భారత్ 37-21తో చైనీస్ తైపీని చిత్తు చేసి గ్రూపు-ఎలో అగ్రస్థానంలో నిలిచింది. భారత్ అజేయంగా గ్రూపును ముగించింది. అంతకుముందు మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గింది. ఆసియా క్రీడల్లో 1980లో కబడ్డీని ప్రవేశపెట్టినప్పటి నుంచి భారత్‌దే ఆధిపత్యం. ఇప్పటివరకు 9 పతకాలు నెగ్గింది. 2018 (కాంస్యం)లో మినహా స్వర్ణాలన్నీ భారత్‌వే. మహిళల కబడ్డీలో భారత్ 32-13తో జపాన్‌ను చిత్తు చేసింది. గ్రూప్ దశలో మహిళల జట్టు కూడా నాలుగు మ్యాచ్‌ల్లో విజయాన్ని అందుకుంది.
Citations · 7 reports from 3 outlets
Tap a citation to read it above, right here on T.A.M.
Asian Games 2026: పతక పరుగు మొదలైంది.. - Eenadu
Asian Games 2026: పతక పరుగు మొదలైంది.. Eenadu
8 hours agoAsian Games 2026: గర్జించిన గన్.. షూటింగ్‌లో ఒకే రోజు 3 పతకాలు - Eenadu
Asian Games 2026: గర్జించిన గన్.. షూటింగ్‌లో ఒకే రోజు 3 పతకాలు Eenadu
3 days agoAsian Games 2026 : ఆసియా క్రీడలు 2026లో భారత్‌కు తొలి స్వర్ణం.. మహిళల క్రికెట్‌లో.. ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక పై హర్మన్ సేన ఘన విజయం.. - 10TV Telugu
Asian Games 2026 : ఆసియా క్రీడలు 2026లో భారత్‌కు తొలి స్వర్ణం.. మహిళల క్రికెట్‌లో.. ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక పై హర్మన్ సేన ఘన విజయం.. 10TV Telugu
2 days agoAsian Games 2026: మహిళా క్రికెట్ జట్టుకు పసిడి పతకం.. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము ప్రశంసలు - Vaartha
Asian Games 2026: మహిళా క్రికెట్ జట్టుకు పసిడి పతకం.. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము ప్రశంసలు Vaartha
2 days agoAsian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే? - NTV Telugu
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే? NTV Telugu
22 hours agoAsian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో భారత్‌కు తొలి పతకం.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో సిల్వర్ - NTV Telugu
Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో భారత్‌కు తొలి పతకం.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో సిల్వర్ NTV Telugu
5 days agoAsian Games 2026: షూటింగ్‌లో మరో రజత పతకం.. టేబుల్ టెన్నిస్‌లో పాకిస్థాన్‌ను 3-0తో చిత్తు చేసిన భారత్ - NTV Telugu
Asian Games 2026: షూటింగ్‌లో మరో రజత పతకం.. టేబుల్ టెన్నిస్‌లో పాకిస్థాన్‌ను 3-0తో చిత్తు చేసిన భారత్ NTV Telugu
4 days ago